ఏపీలో 7384 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం
వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : నిరుద్యోగులకు త్వరలో ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. రైతు భరోసా కేంద్రాలను మరింత బలోపేతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆర్బీకేల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వంలోని శాఖల వారీగా ఖాళీగా ఉన్న 7384 పోస్టులను భర్తీ చేయనున్నారు 518 పశుసంవర్ధక సహాయక పోస్టులు, 1644 ఉద్యాన, 427 వ్యవసాయ, 63 మత్స్య, 22 పట్టు సహాయక పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్క తేల్చారు. ఏపీలోని 660 మండలాల్లో 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేయగా వీటిలో 14,347 మంది సేవలందిస్తున్నారు.
ఈ–క్రాప్, ఈ–కేవైసీ, పొలం బడులు, తోట, మత్స్య సాగు బడులు, పశువిజ్ఞాన బడుల నిర్వహణతో పాటు ఇతర రైతు ప్రాయోజిత కార్యక్రమాల అమలు కోసం ఆర్బీకే సిబ్బంది క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో ఆర్బీకేలకు వచ్చే రైతులకు ఆటంకాలు లేకుండా సేవలందించడానికి స్థానికంగా చురుగ్గా ఉండే వలంటీర్‌ను ఆర్బీకేలకు అనుసంధానించారు. మరోవైపు గ్రామ స్థాయిలో బ్యాంకింగ్ సేవలందించే సంకల్పంతో 9,160 బ్యాంకింగ్ కరస్పాండెంట్లను కూడా ఆర్బీకేలకు అనుసంధానం చేశారు. వన్ స్టాప్ సొల్యూషన్ సెంటర్స్‌గా వీటిని తీర్చిదిద్దడంతో పాటు రైతులకు అందించే సేవలన్నింటినీ ఆర్బీకేలు కేంద్రంగా అందిస్తున్నారు. దీంతో ఆర్బీకేల్లో సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది.
ఈ నేపథ్యంలో శాఖల వారీగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆర్బీకేలతో పాటు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సంక్రాంతిలోగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోందని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.మధుసూదనరెడ్డి తెలిపారు. ప్రతీ ఆర్బీకేలో స్థానికంగా ఉండే పాడిపంటలను బట్టి సిబ్బంది ఉండేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని, వాటికనుగుణంగా ఖాళీ పోస్టుల భర్తీ కోసం చర్యలు చేపట్టినట్లు ఆయన అన్నారు.