యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్య కైంకర్యాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం 4 గంటలకు స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. నిత్యపూజల్లో భాగంగా బాలాలయ మండపంలో లక్ష్మీనరసింహుడి నిత్యకల్యానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. మొదటగా స్వామివారి శ్రీసుదర్శన నారసింహహోమం చేపట్టారు. మహామండపంలో అష్టోత్తరం చేపట్టారు. సాయంత్రంవేళ అలంకార సేవోత్సవాన్ని సంప్రదాయబద్దంగా చేశారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ చేశారు. హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించి, తమలపాకులతో అర్చన చేశారు. లలితా పారాయణం చేసి ఆంజనేయస్వామివారికి ఇష్టమైన వడపప్పు, బెల్లి, అరటిపండ్లను నైవేద్యంగా సమర్పించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. సత్యనారాయణ వ్రతాలను ఆచరించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.