4వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య
వరంగల్ టైమ్స్, ఢిల్లీ : దేశాన్ని కరోనా వైరస్ మరోసారి కలవరపెడుతోంది. ఎప్పటికప్పుడు రూపాలు మార్చుకుంటూ దాడి చేస్తున్న మహమ్మారి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. ప్రస్తుతం కరోనా ఉప వేరియంట్ జేఎన్.1 కారణంగా దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. డిసెంబర్ 25 నాటికి దేశ వ్యాప్తంగా యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 4 వేలు దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం దేశంలో 4,054 యాక్టివ్ కేసులున్నాయి. ఆదివారం నాటికి 3,742 గా ఉన్న యాక్టివ్ కేసులు, సోమవారం నాటికి 4 వేలు దాటాయి. కరోనా కారణంగా గత 24 గంటల్లో కేరళలో ఒకరు మరణించారు. కోవిడ్ సబ్-వేరియంట్ జేఎన్.1 మొదటిసారిగా గుర్తించిన కేరళలో ఒక రోజులో అత్యధిక సంఖ్యలో 128 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా కారణంగా ఇప్పటివరకు 5,33,334 మంది చనిపోయారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 315 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4,44,71,860 చేరుకుంది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.