వరంగల్ లో వందేభారత్ కు గ్రాండ్ వెల్కమ్
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : సికింద్రాబాద్ లోని 10వ నంబర్ ప్లాట్ ఫాం నుంచి ప్రారంభమైన వందేభారత్ రైలు మధ్యాహ్నం 1. 27 గంటల ప్రాంతంలో వరంగల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. వరంగల్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు స్థానిక బీజేపీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, స్థానికులు, ప్రయాణికులు ఘన స్వాగతం పలికారు.
వందేభారత్ రైలును చూసేందుకు మధ్యాహ్నం 12 గంటలకు వరంగల్ రైల్వే స్టేషన్ కు స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక మధ్యాహ్నం 1.27 గంటల ప్రాంతంలో కాజీపేట మీదుగా వచ్చిన వందేభారత్ రైలుకు రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు డప్పు చప్పుళ్లతో, బెలూన్లు ఎగురవేస్తూ గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణంకు బయల్దేరిన ఈ ట్రైన్ కు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్టణానికి హాల్టింగ్ ఉంది. అయితే ఈ రోజే వందేభారత్ ప్రారంభమైంది కావున ప్రజల సందర్శనార్ధం అన్ని సికింద్రాబాద్ టూ విశాఖ పట్టణం మధ్యలో ఉన్నపలు స్టేషన్ లో నెమ్మదిగా నడిచింది. అయితే గంటకు 180 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు ఇక్కడున్న ట్రాక్ లను దృష్టిలో పెట్టుకుని 130 నుంచి 160 కిలో మీటర్ల వేగంతో నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారుల సమాచారం. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మధ్య 350 కిలో మీటర్ల దూరాన్ని 4 గంటల్లో చేరుకుంటుందని , సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణంకు ఎనిమిదిన్నర గంటల్లో చేరుకుంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు.