అగ్నికి ఆహుతైన కార్మికులు..ఎక్కడంటే..!
వరంగల్ టైమ్స్, అమరావతి : అనకాపల్లిలోని పరవాడ ఫార్మాసిటీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లారస్ ల్యాబ్ లోని మూడో యూనిట్ లో షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడి మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చారు.
గాయపడిన పలువురు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. మృతులను బి.రాంబాబు, రాజేశ్ బాబు, రామకృష్ణ, మజ్జి వెంకటరావు, సతీష్ గా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఉత్పత్తి లేని బ్లాక్ శుభ్రం చేస్తున్న సమయంలో రియాక్టర్ నుంచి మంటలు వచ్చి ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు పేర్కొన్నారు. మరోవైపు పోలీసులు మాత్రం రియాక్టర్ నుంచి మంటలు రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.