ఢిల్లీ: ప్రతి భారతీయుడూ తరతరాలు గర్వంగా చెప్పుకొనే రోజు ఇది. స్వతంత్ర భారతచరిత్రలో మన సైన్యం అద్భుత వీరోచిత విజయాన్ని సువర్ణాక్షరాలతో లిఖించిన రోజు. జులై 26.. కార్గిల్ విజయోత్సవానికి సరిగ్గా 21 ఏళ్లు. కార్గిల్‌లో పాక్ చొరబాటుదారులు ఆక్రమించిన భారత సైనిక శిబిరాలన్నింటినీ మన సైన్యం తిరిగి చేజిక్కించుకున్న విజయ దినోత్సవం. పాకిస్థాన్‌కు పీడకలను మిగిల్చిన కార్గిల్ యుద్ధం భారత సైన్యం శౌర్య పరాక్రమాలకు నిలువుటద్దం. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా భారత సైన్యం ట్విటర్లో ఓ అద్భుతమైన పోస్ట్ పెట్టింది. ‘ఆపరేషన్ విజయ్’కు ఒకరోజు ముందు నాటి విశేషాలను పంచుకుంది. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన కార్గిల్ యుద్ధ వీరులను స్మరించింది.”1999 జూన్ 25న భారత సైన్యం ముష్కో లోయలో జులూ టాప్ వద్ద సాహసోపేతంగా తలపడింది. మన సైనిక దళాలు అమేయ ధైర్యసాహసాలు, తిరుగులేని నిబద్ధత వల్ల ఆ శిబిరం భారత్ పరమైంది.”
”ఆపరేషన్ విజయ్ అనేది ధీర భారత సైనికుల సాహసం, శౌర్యం, పరాక్రమం, త్యాగాలతో కూడిన వీరగాథ. జులై 26.. దృఢసంకల్పం, ధీరోదాత్త నాయకత్వం, మన సైనికుల తెగువకు చిరస్మరణీయంగా నిలుస్తుంది.” అని సైన్యం పేర్కొంది.
కార్గిల్ యుద్ధం విశేషాలు..
* 1999 మే, జులైల మధ్య నియంత్రణ రేఖ వద్ద జమ్మూ-కశ్మీర్‌లోని కార్గిల్ జిల్లాలో జరిగింది.
* పాకిస్థాన్ సైన్యం వెన్నుదన్నుతో ఆ దేశ ఉగ్రవాదులు కార్గిల్‌లోని భారత భూభాగంలోకి చొచ్చుకురాగా.. ఆ ప్రాంతంలో గస్తీ తిరుగుతున్న భారత సైన్యం గుర్తించింది.
* స్థానిక గొర్రెలకాపరులు ఇచ్చిన సమాచారం ఆధారంగా చొరబాటుదారులు ఎక్కడి నుంచి ఆకస్మిక దాడి చేస్తారో ఆ ప్రాంతాలను భారత సైన్యం గుర్తించగలిగింది.
* పాక్ చొరబాట్లను తిప్పికొట్టేందుకు భారత్ ప్రారంభించిన సైనిక చర్య పేరు ‘ఆపరేషన్ విజయ్’. ఇదే రీతిలో మన వైమానిక దళం ‘సఫేద్ సాగర్’ పేరిట వైమానిక దాడులు చేసింది.
* అత్యంత కఠినమైన పరిస్థితుల్లో భారత సైనికులు కార్గిల్ యుద్ధంలో పోరాడారు. 18,000 అడుగుల ఎత్తులో ఏమాత్రం అనుకూలంగా లేని ప్రాంతంలో వీరోచిత పోరాటం జరిపారు.
* 527 మంది భారత సైనికులు ఈ యుద్ధంలో అమరులయ్యారు. 1363 మంది గాయపడ్డారు. అదే సమయంలో 3 వేల మందికి పైగా పాక్ సైనికులను మన సైన్యం మట్టుపెట్టింది.