నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నేడు యాదాద్రిలో పర్యటించనున్నారు. యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు శ్రీరామ అలంకార సేవలో భక్తులకు లక్ష్మీ నరసింహ స్వామి దర్శనమివ్వనున్నారు. ఉదయం 11 గంటలకు గజవాహన సేవ, తిరుకల్యాణ మహోత్సవం జరుగనున్నాయి. తిరుకల్యాణోత్సవానికి సీఎం కేసీఆర్ దంపతులు హాజరుకానున్నారు. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.అలాగే యాదాద్రి ఆలయ బంగారు తాపడం కోసం తమ కుటుంబం తరపున సీఎం కేసీఆర్ 1. 16 కిలోల బంగారాన్ని అందచేయనున్నారు. మరోవైపు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో దివ్యక్షేత్రం మహాకుంభ సంప్రోక్షణకు ముస్తాబవుతోంది. మార్చి 21 నుంచి 28 వరకు జరిగే కార్యక్రమాల కోసం 75 ఎకరాల్లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొండపైకి ప్రధాన ఆలయం భక్తుల దర్శనాలకు సిద్ధమైంది. కృష్ణ శిలలతో లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. భక్తులకు మరుపురాని మధురానుభూతి పంచేలా యాదాద్రిని తీర్చిదిద్దుతున్నారు.
స్వయంభువుల దర్శనాలకు చకచకగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొండ దిగువన పెద్దఎత్తున పనులు జరుగుతున్నాయి. విశాలమైన రహదారుల నిర్మాణంతో పాటు పచ్చదనం, సుందరీకరణ పనులు నిర్విరామంగా సాగుతున్నాయి. మార్చి 28 వరకు బాలాలయంలో స్వామివారి దర్శనాలు కొనసాగించి, అనంతరం కవచమూర్తులను ప్రధానాయాలనికి తరలించనున్నారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక బాలాలయాన్ని మూసివేయనున్నారు.