ఎంజీఎంలో వ్యాక్సిన్ వికటించి మహిళ మృతి
వరంగల్ టైమ్స్, వరంగల్ : ఎంజీఎంలో కుక్క కాటుకు వైద్యం కోసం వచ్చిన ఓ మహిళకు వ్యాక్సిన్ వికటించి మృతి చెందటం కలకలం సృష్టించింది. వరంగల్ అర్బన్ జిల్లా దేశాయిపేటకు చెందిన కిరణ్మయి అనే మహిళకు గత వారం క్రితం కుక్క కరవడంతో వైద్య చికిత్స కోసం ఎంజీఎంను ఆశ్రయించింది. వైద్యుల సూచనమేరకు మొదటి టీకా బాగానే పని చేసింది.రెండో వాక్సిన్ కోసం శనివారం మరోసారి ఎంజీఎంకు వెళ్ళింది. అయితే వాక్సిన్ వేసిన కొన్ని క్షణాలకే శరీరంలో మార్పు వచ్చినట్లు వైద్య సిబ్బంది గుర్తించారు. దీంతో హుటా హుటిన వైద్యాధికారులు కిరణ్మయిని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అప్పటికే పరిస్థితి చేజారిపోవడంతో కిరణ్మయి మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.