ఖమ్మం పాలిటిక్స్ లోకి ట్రబుల్ షూటర్!
వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : మంత్రి హరీశ్ రావుపై సీఎం కేసీఆర్ ప్రత్యేక అభిమానం. మేనల్లుడిగా కంటే పార్టీపరంగా ఆయనకు ఎలాంటి బాధ్యత అప్పజెప్పినా సక్సెస్ చేస్తారని సీఎం భావిస్తారు. ముఖ్యంగా ఉద్యమ సమయంలో చాలా ఉప ఎన్నికల్లో హరీశ్ రావు ప్లానింగ్ తోనే గులాబీదళం సత్తా చాటింది. కేసీఆర్ అనుకున్న దానికంటే టీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కువ మెజార్టీ సాధించిన దాఖలాలు కూడా ఉన్నాయి. అందుకే సీఎం కేసీఆర్ కు హరీశ్ అంటే ఎంతో నమ్మకం. కేసీఆర్ ఆయనను ట్రబుల్ షటూర్ గా భావిస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో హరీశ్ రావు పాత్ర ఎంతో ఉంది. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లోనూ హరీశ్ సత్తా ఏంటో మరోసారి రుజువైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గులాబీదళం ఓడించిందంటే దాని వెనక హరీశ్ రావు పాత్రే కీలకం అని టాక్.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడడంపై క్లారిటీ వచ్చేయడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. పొంగులేటికి ఆర్థిక, అంగ బలం ఉండడంతో ఆయన వెంట పెద్ద తలకాయలు ఎవరెవరకు వెళ్తారో తెలియక గులాబీదళంలో టెన్షన్ లో ఉంది. మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల పేర్లు బయటకు వస్తుండడంతో బీఆర్ఎస్ లో గుబులు రేగుతోంది. దీంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం పువ్వాడ అజయ్ రంగంలోకి దిగారట. కానీ పువ్వాడ అజయ్ తోనూ పరిస్థితి కంట్రోల్ లోకి వచ్చేలా కనిపించడం లేదని సమాచారం. దీనికి తోడు ఈనెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించబోతోంది. పార్టీ ఆవిర్భావ సభ కావడంతో సీఎం కేసీఆర్ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. లక్షలాదిమంది జనాలను సమీకరించి ఖమ్మం గడ్డ నుంచి పొలికేక పెట్టేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు.
ఓవైపు పొంగులేటి ఫ్యాక్టర్ తో ఉమ్మడి ఖమ్మం జిల్లా గులాబీశ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఈ తరుణంలో బీఆర్ఎస్ మీటింగ్ అనేసరికి ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు.. జన సమీకరణ కష్టమేనని ఆందోళన చెందుతున్నారట. అందుకే ట్రబుల్ షూటర్ హరీశ్ రావును ఆగమేఘాల మీద ఖమ్మం జిల్లాకు పంపారు కేసీఆర్. ముఖ్యమంత్రి ఆదేశాలతో హరీశ్ ఇప్పటికే ఖమ్మంలో మకాం వేశారు. ఖమ్మం సభ నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఓవైపు బహిరంగ సభ ఏర్పాట్లను ప్రతిరోజూ పరిశీలిస్తూనే, నియోజకవర్గాల వారీగా సన్నాహక సభలు నిర్వహిస్తున్నారు. తనదైన శైలిలో నేతలు, క్యాడర్ తో మాట్లాడుతూ నూతోనోత్తేజం నింపే ప్యత్నం చేస్తున్నారు హరీశ్ రావు.
నిజానికి ఖమ్మం సభను విజయవంతం చేసే బాధ్యతతో పాటు సీఎం కేసీఆర్ హరీశ్ రావుకు మరో టాస్క్ కూడా ఇచ్చారట. పొంగులేటి ఫ్యాక్టర్ తో పార్టీకి ఎలాంటి డ్యామేజ్ జరగనుంది? ఎవరెవరు ఆయన వెంట వెళ్లే అవకాశముంది? పొంగులేటి ఎఫెక్ట్ తో బీఆర్ఎస్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? తదితర అంశాలపై డీటైల్డ్ రిపోర్ట్ ఇవ్వాలని హరీశ్ రావును కేసీఆర్ ఆదేశించారట. ఈ మేరకు ఇవాళ లేదా రేపు కేసీఆర్ కు హరీశ్ రావు పక్కా రిపోర్ట్ ఇవ్వనున్నారని సమాచారం. అందుకే హరీశ్ రావు ఖమ్మంలోనే మకాం వేసి, అన్నీ వాకబు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అసంతృప్త నాయకులతో స్వయంగా మాట్లాడి, నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు టాక్. అవసరమైతే సీఎం కేసీఆర్ తో అపాయింట్ మెంట్ ఇప్పించి, తగిన భరోసా వచ్చేలా చూస్తానని కూడా అసంతృప్త నాయకులతో హరీశ్ రావు చెబుతున్నారని సమాచారం.
మొత్తానికి ఖమ్మం గడ్డపై హరీశ్ రావు జోరు పెంచారు. ఓవైపు బహిరంగ సభ బాధ్యతలు, మరోవైపు పొంగులేటితో పార్టీకి డ్యామేజ్ జరగకుండా కంట్రోల్ చేయడం లాంటివి చేస్తున్నారు. ట్రబుల్ షూటర్ స్వయంగా ఖమ్మంలో మకాం వేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు కూడా హ్యాపీగా ఉన్నారట. మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తిని స్వయంగా హరీశ్ రావుకే కంప్లయింట్ చేస్తున్నారట. దీంతో హరీశ్ రావు అక్కడికక్కడే పరిస్థితిని చక్కదిద్దుతున్నట్లు టాక్. ఎన్నికల ముంగిట పార్టీ క్యాడర్ లో అసంతృప్తి మంచిది కాదని, నేతలంతా పద్ధతి మార్చుకోవాలని హరీశ్ రావు గట్టిగానే హెచ్చరిస్తున్నట్లు సమాచారం. ఇలా హరీశ్ రావు ఖమ్మం బీఆర్ఎస్ లో అన్నీ తానై చూసుకుంటున్నారు. మరి హరీశ్ రావు మంత్రాంగం ఎంత స్ట్రాంగ్ గా పనిచేస్తుందో చూడాలి. ఎప్పటిలాగానే ఆయన ఎంట్రీతో గులాబీదళానికి లాభం జరుగుతుందా? లేదా? అన్నది కాలమే తేల్చాలి.