హనుమకొండ జిల్లా : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో ఉపాధి కల్పనా మార్గాలు, వసతులు అనేకం నెలకొల్పబడుతున్నాయి. చిన్నా, పెద్దా పరిశ్రమల ఏర్పాటు దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆమోదముద్ర వేస్తున్నారు. పరిశ్రమలు నెలకొల్పడం వల్ల వేలాది, లక్షలాది మందికి ఉపాధి కల్పించవచ్చన్న ఆలోచనతో అనుకున్నదే తడవుగా దేశ, విదేశాల్లోని పలు కంపెనీల ప్రతినిధులతో సలహాలు, సూచనలు తీసుకుని, తమ ఆలోచనలను పంచుకుని పరిశ్రమ రంగాన్ని డెవలప్మెంట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ దిశగానే దేశ విదేశాల్లో ఉన్న కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి కంపెనీలు ఏర్పాటు చేసేలా ముందుకు రావడంలో కేటీఆర్ కృషి చేస్తున్నారు
ఇందులో భాగంగానే కేటీఆర్ ఆదేశాల మేరకు కైటిక్స్ గార్మెంట్స్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని కలిసారు. హనుమకొండలోని ఆయన నివాసంలో కైటిక్స్ గార్మెంట్స్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు మనోజ్ కుమార్, ఎచ్.ఎస్.సోది (వి.పి – బిజినెస్ ఆపరేషన్స్) మరియు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ ఇన్నోవేషన్ అధికారిని డా.శాంత తౌటం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసారు. కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమలో కంపెనీలు ఏర్పాటుకు కేటీఆర్ సూచన మేరకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని కైటిక్స్ కంపెనీ ప్రతినిధులు కలిసినట్లు తెలిపారు. కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమలో నిర్మించనున్న కైటిక్స్ కంపెనీ పురోగతి, పలు అంశాల గురించి ఎమ్మెల్యే వారితో చర్చించారు.
కైటిక్స్ గార్మెంట్స్ కంపెనీ ఏర్పాటు సంతోషం : చల్లా
కేటీఆర్ కృషి వల్లే ఈ రోజు పొరుగు రాష్ట్రాలు మరియు దేశాల నుండి కంపెనీలు తెలంగాణలో ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. తమ నియోజకవర్గంలో గీసుగొండ, సంగెం మండలాల శివారులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమలో మంచి పేరున్న కైటిక్స్ గార్మెంట్స్ కంపెనీ ఏర్పాటు కావడం ఎంతో శుభసూచకమని చల్లా అన్నారు. మంత్రి కేటీఆర్ కృషి వల్లే ఈ రోజు కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమలో కంపెనీలు ఏర్పాటు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కి ఎమ్మెల్యే చల్లా కృతజ్ఞతలు తెలిపారు. దేశ విదేశాల్లో ఉన్న కంపెనీలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి కంపెనీలు ఏర్పాటు చేయాలని చూస్తున్నారంటే దాని వెనకాల మంత్రి కేటీఆర్ కఠోర శ్రమ, కృషి ఎంతో ఉందన్నారు.
మహిళలకు, పురుషులకు ఉపాధి అవకాశం..
వచ్చే జూన్ నుండి ఆగస్టు వరకు 800 కంటైనర్లలో కంపెనీ నిర్మాణానికి సంబంధించిన మిషనరీ రానున్నట్లు వారు తెలిపారు. 201 ఎకరాలలో నిర్మించనున్న ఈ కైటిక్స్ కంపెనీలో మెకానికల్, ఎలెక్ట్రికల్, సివిల్, ఐ.టి.ఐ. విద్యార్హతలున్న వారికి టెక్నికల్ విభాగంలో, అకౌంట్స్ విభాగంలో మరికొందరికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. కంపెనీ ఏర్పాటు తర్వాత 9 వేల మంది మహిళలు, 2 వేలమంది పురుషులకు ఉపాధి లభిస్తుందన్నారు. వీరందికీ 15 రోజులు కంపెనీ వాళ్ళే శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ కాలంలో మరియు ఉద్యోగ విధుల నిర్వాహణ కాలంలో కూడా కంపెనీ వారే ఉచితంగా భోజన వసతి కల్పించనున్నట్లు వెల్లడించారు.
ఈ కంపెనీ ఏర్పాటుతో వరంగల్ జిల్లాలో పత్తి పంట పండించే రైతులకు మంచి డిమాండ్ ఏర్పడుతుందన్నారు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి . మన దగ్గర పండించే పత్తిని నేరుగా ఈ కంపెనీ ప్రతినిధులతో ఒప్పందం చేసుకొని సరఫరా చేసే విధంగా వెసులుబాటు ఉంటుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపేందుకు సీఎం కేసీఆర్ ఒక విజన్ తో ముందుకెళ్తున్నారన్నారని ఎమ్మెల్యే కొనియాడారు.