హైదరాబాద్: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకై చొరవ తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కల్వకుంట్ల రామారావుని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు కలిశారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ లు ఈ మేరకు కేటిఆర్ ని ప్రగతి భవన్ లో గురువారం కలిశారు. ఈ సందర్భంగా కాజీపేట రైల్వే కోచ్ వరంగల్ ప్రజల చిరకాల వాంఛ అని, అనేక పోరాటాలు చేసినా మంజూరు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు అవసరమైన భూమిని కూడా సిద్ధం చేశామని వారు కేటిఆర్ కి వివరించారు. కేంద్రంతో మాట్లాడి, అవసరమైన చర్యలు తీసుకోవాలని, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పడితే, ఇక్కడి యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ ప్రాంతానికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఏర్పడుతుందని వారు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి కూడా మంచిపేరు వస్తుందని వారు అన్నారు. ఈ మేరకు వారు ఓ వినతి పత్రాన్ని కేటిఆర్ కి అందచేశారు.