హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వివిధ శాఖలలోని ఖాళీల వివరాలను సేకరించుటకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు , ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సోమవారం బీఆర్కేఆర్ భవన్ లో సమావేశం నిర్వహించారు. 50 వేల పోస్టులను భర్తీ చేయాలన్న సీఎం ప్రకటనకు అనుగుణంగా అన్ని శాఖలు ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలను సమర్పించాలన్నారు. అధికారులు ఖాళీల వివరాలను నిర్ణీత ప్రొఫార్మాలో సమర్పించాలని సీఎస్ ఆదేశించారు. ఈ వివరాలను క్రోడీకరించి సీఎం కేసీఆర్‌కు సమర్పించవలసి ఉంటుందన్నారు. నియామకాల ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అవసరమైన మార్పులు మరియు సంస్కరణలను తీసుకురావడం ద్వారా నియామక ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వివిధ శాఖలలో ని ఖాళీలను భర్తీ చేయడానికి సరైన మెకానిజాన్ని అమలు చేస్తామమని సీఎస్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి , ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు చిత్రా రామచంద్రన్, శాంతి కుమారి, రాణి కుముదిని, ముఖ్య కార్యదర్శులు సునీల్ శర్మ, రజత్ కుమార్ , జయేష్ రంజన్ , రవి గుప్తా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.