ఖమ్మం జిల్లా : ఈ నెల 3న రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే వనమా రాఘవను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.
తాజాగా రామకృష్ణ తల్లి సూర్యవతి, చెల్లెలు మాధవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ-3, ఏ-4గా రామకృష్ణ తల్లి, చెల్లెలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. తల్లి, చెల్లెలికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ ఇద్దరిని ఖమ్మం సబ్ జైలుకు పోలీసులు తరలించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవను కొత్తగూడెం మెజిస్ట్రేట్ ముందు పోలీసులు శనివారం ఉదయం హాజరుపరిచారు. విచారణ అనంతరం రాఘవకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
దీంతో వనమా రాఘవను భద్రాచలం సబ్ జైలుకు తరలించారు. ఈ దుర్ఘటనకు కారణం తానేనని వనమా రాఘవ పోలీసుల ముందు ఒప్పుకున్నాడని ఏఎస్పీ రోహిత్ తెలిపిన విషయం తెలిసిందే. వనమా రాఘవ కేసుకు సంబంధించి మీడియా సమావేశంలో ఏఎస్పీ రోహిత్ మాట్లాడారు. వనమా రాఘవపై ఈ కేసుతో పాటు మరో 12 కేసులు ఉన్నాయని స్పష్టం చేశారు.