న్యూఢిల్లీ: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీనే ప్రత్యామ్నాయ పార్టీగా నిలుస్తుందని సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. కేవలం తన కుటుంబం మాత్రమే బాగుపడాలనే స్వార్థం వున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ను గద్దె దింపేది తామేనని ఆమె హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విజయశాంతి సోమవారం బీజేపీలో చేరారు. జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా విజయశాంతి తన రాజకీయ జీవితం గురించి మాట్లాడారు. “1998లో బీజేపీలో చేరిన తాను, బీజీపీలో కొందరు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారన్న ఆవేదనతో 2005లో ఆ పార్టీ నుంచి బయటికి వచ్చినట్లు తెలిపారు. ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి అనేక సమస్యలపై పోరాటం చేశానని చెప్పారు. అప్పుడు నా పార్టీనీ టీఆర్ఎస్లో విలీనం చేయమని అడిగారు. నిజానికి నేను 1998లోనే తెలంగాణ పోరాటం మొదలు పెట్టాను. టీఆర్ఎస్ కంటే ముందు నేను తెలంగాణ ఉద్యమంలో భాగస్వామినయ్యాను. కేసీఆర్ కుట్రతోనే టీఆర్ఎస్ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేశారు. తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు కేసీఆర్ పార్లమెంట్లో లేరు. ఆయన సోనియా గాంధీ కాళ్ళ మీద పడ్డారు. ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. తెలంగాణలో తన కుటుంబం మాత్రమే ఎదగాలనే స్వార్థం కేసీఆర్‌ది. కాంగ్రెస్ పార్టీ అసలు సమస్యలపై పోరాటం చేయడం లేదు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ మాత్రమే’’ అని రాములమ్మ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు”. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి , తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కె.లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.