ముంబై : విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు మహారాష్ట్రలోని తలోజా జైలు సిబ్బంది ఆయన భార్యకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ప్రస్తుతం తలొజా జైల్లో ఉన్న ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని జైళ్ల శాఖ తెలిపింది. వరవరరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. భీమా కోరేగావ్ కేసులో వరవరరావు అరెస్ట్ అయ్యారు. వరవరరావు అనారోగ్యంగా ఉన్నారని, బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపున లాయర్లు దాఖలు చేసిన పిటిషన్ను కొద్దిరోజుల క్రితం కోర్టు కొట్టి వేసింది. భీమా కోరేగావ్ కేసులో వరవరరావు కీలక నిందితుడని, ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కోర్టు పిటిషన్ను తిరస్కరించింది. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 2018 నవంబర్లో అరెస్టయిన వరవరరావును తొలుత మహారాష్ట్ర పుణేలోని ఎరవాడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎరవాడ నుంచి నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించారు. తలోజా జైలులో కరోనా బారిన పడి ఒకరు మరణించినట్లు ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. ఈ నేపథ్యం లో వృద్ధుడైన తమ తండ్రిని జైలు నుంచి విడుదల చేయాలంటూ వరవరరావు కుమార్తెలు ఇటీవల మహా రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితరులకు లేఖలు కూడా రాశారు.