అటు వైపు పోతే ఇక అంతే
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : ఎప్పుడూ వాహనదారులు, పాదచారుల రాకపోకలతో రద్దీగా వుండే వరంగల్ అండర్ బ్రిడ్జి రోడ్డు మూతపడనుంది. కాజీపేట-విజయవాడ మధ్యలో రోజురోజుకు పెరుగుతున్న రైళ్ల రాకపోకల వల్ల పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఆలస్యంగా వస్తున్న రైళ్ళ రాకపోకలతో ప్రయాణికులు కూడా గత కొన్నేండ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులను సరైన సమయానికి గమ్యానికి చేర్చడానికి రైల్వే శాఖ సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్ రైళ్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో రైల్వే లైన్లు రద్దీగా మారుతున్నాయి. దీంతో పలు గూడ్స్ రైళ్లను సరైన సమయంలో నడపలేకపోతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.దక్షణ మధ్య రైల్యే మార్గాలలో అప్ అండ్ డౌన్ రెండు ట్రాక్ లు మాత్రమే ఉండటంతో నిత్యం ఈ సమస్య ఎదురవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడానికి రైల్వే అధికారులు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే మూడవ రైల్వే ట్రాక్ నిర్మాణ పనులను అక్టోబర్ 27 నుంచి నవంబర్ 27 వరకు సంబంధిత అధికారులు చేపట్టనున్నారు. అయితే ఈ మూడవ రైల్వే లైన్ పనుల వల్ల నగర ప్రజలకు ఇబ్బందులు ఎదురుకానున్న నేపథ్యంలో శివనగర్, వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి మార్గాన్ని మూసివేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. కావున ప్రజలు వేరే మార్గాల ద్వారా తమ గమ్య స్థానాలను చేరుకోవాలని, నిర్మాణపనులు పూర్తయ్యేవరకు తమకు సహకరించాలని రైల్వే అధికారులు కోరారు.
ప్రజల బద్రత దృష్ట్యా వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి మార్గం గుండా వెళ్లే వాహనదారులను ట్రాఫిక్ డైవర్షన్ చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ట్రాఫిక్ డైవర్షన్ వివరాలు ఈ కింది విధంగా ఉంటాయి.
1) వర్ధన్నపేట వైపు నుంచి అండర్ బ్రిడ్జి ద్వారా హెడ్ పోస్ట్ ఆఫీస్ వైపు మరియు రైల్వే స్టేషన్, బస్సు స్టేషన్ లకు వెళ్లాల్సిన అన్ని వాహనాలను ఫోర్ట్ రోడ్ డైవర్షన్ పాయింట్ ద్వారా చింతల్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి మరియు వెంకట్రామా జంక్షన్ మీదుగా దారి మళ్లించనున్నారు.
2) వరంగల్ రైల్వే స్టేషన్, బస్సు స్టేషన్ మరియు హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి అవతలి వైపుకు అనగా వర్ధన్నపేట వైపుకు వెళ్లాల్సిన బస్సులు మరియు అన్ని వాహనాలు వెంకట్రామ జంక్షన్ మరియు చింతల్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి ద్వారా వెళ్లాల్సిందిగా రైల్వే అధికారులు సూచించారు.