స్పోర్ట్స్ డెస్క్ : ఇంగ్లండ్ తో జరిగిన మూడో టీ20లో వెస్టిండీస్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. 5 మ్యాచ్ ల సిరీస్ లో ప్రస్తుతం కరీబియన్ జట్టు 2-1 తో ముందంజలో నిలిచింది. బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. పావెల్ శతక్కొట్టగా , నికోలస్ పూరన్ ( 43 బంతుల్లో 70 ; 4 ఫోర్లు, 5 సిక్సర్లు ) తుపాను ఇన్నింగ్స్ ఆడాడు.
ఇంగ్లండ్ బౌలర్లలో మిల్స్, లివింగ్ స్టోన్, ఆదిల్ రషీద్, గార్టన్, టాప్లే తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 204 పరుగులకు పరిమితమైంది. వికెట్ కీపర్ టామ్ బాంటన్ (39 బంతుల్లో 73 ; 3ఫోర్లు, 6 సిక్సర్లు ), ఫిల్ సాల్ట్ ( 24 బంతుల్లో 57 ;3 ఫోర్లు, 5 సిక్సర్లు ) మినహా మిగిలినవాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. విండీస్ బౌలర్లలో షెఫర్డ్ 3, పొలార్డ్ రెండు వికెట్లు పడగొట్టారు. సెంచరీతో
విజృంభించిన పావెల్ కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.