ఈ బడ్జెట్ చూసిన ప్రతిపక్షాలకు పరేషానే: దాస్యం
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన 2023-24 వార్షిక బడ్జెట్ ను చూసి ప్రతిపక్షాలు ఖచ్చితంగా పరేషాన్ అవుతాయని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రూ.2,90,392 కోట్లతో తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావుకు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడుగడుగునా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నప్పటికి, రెట్టింపు స్థాయిలో రాష్ట్రాన్ని స్వయం కృషితో కేసీఆర్ నాయకత్వంలో ముందుకు నడిపిస్తున్నామని ఆయన అన్నారు.
అందుకు నిదర్శనంగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చెయ్యి చూపినప్పటికి రాష్ట్రాభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి రూ.2,90,392 కోట్లతో అభివృద్ధి-సంక్షేమ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం గర్వించదగిన విషయమన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని అన్నారు. అందుకు సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు,కేటీఆర్ లకు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ధన్యవాదాలు తెలిపారు.