కలెక్టరేట్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం
వరంగల్ టైమ్స్, నాగర్కర్నూల్ జిల్లా : తమకు రావాల్సిన భూమిని తమ దాయాదులు పట్టా చేసుకున్నారని, తనకు న్యాయం చేయాలని చాలా కాలంగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా..ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆ బాధిత మహిళ బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేసింది. దీంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డు కుర్మయ్య తన చేతిలో ఉన్న అగ్గిపెట్టె లాక్కున్నాడు. అనంతరం బాధిత మహిళను కలెక్టర్ కార్యాలయం ఏవో శ్రీనివాసులు దగ్గర అప్పగించాడు.నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలానికి చెందిన నూర్జహాన్ కు కోడెరు మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 323/అ/1/1 లో 3.23 గుంటల పట్టా భూమి ఉన్నది. తన మామ అబ్దుల్ ఖాదర్ పేర ఉన్న ఈ భూమిని తన మరణానంతరం భార్య చాంద్ భీ పేర విరసత్ చేసుకోగా తనకు ఉన్న నలుగురు కొడుకుల్లో ఇస్మాయిల్, రషీద్ ఇద్దరికి మాత్రమే 2014లో సెల్ డీడీ ద్వారా పట్టా చేశారు. కాగా మిగతా సలీం, చున్నూ మియా ఇరువురికి భూమి పంచడం లేదని సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఎవరూ స్పందించలేదని బాధితులు తెలిపారు. సెల్ డీడీ ద్వారా రిజిస్టర్ చేయడంతో ఈ విషయాన్ని కోర్టులోనే తెల్చుకోవలని ఏవో శ్రీనివాసులు సర్ది చెప్పి పంపారు. పొట్టకూటి కోసం కొద్ది రోజులు ఇతర గ్రామంలో బతుకుదెరువు కోసం వెళ్లామని అంతలోనే మాకు వాటా ఇవ్వకుండా భూమిని లాక్కున్నారని బాధితురాలు మీడియా ముందు మొరపెట్టుకుంది.