Monday, March 24, 2025
Home Blog

అధికారుల అలసత్వంలో నాచారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్

అధికారుల అలసత్వంలో నాచారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్

వరంగల్ టైమ్స్,సిద్ధిపేట జిల్లా: కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం నాచారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి. సుమారు 5000 ఏళ్ళ చరిత్ర కలిగిన నాచారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం సిద్ధిపేట జిల్లా నాచగిరి కొండలపై వెలిసింది. ఐతే నాచగిరి కొండలపై వెలసిన శ్రీ లక్ష్మీ సమేత నరసింహ స్వామి భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు.ఐతే ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ప్రతీ శనివారం,ఆదివారం మాత్రం భక్తులచే స్వామి వారు ప్రత్యేక పూజలు అందుకుంటారు.

ఈ ఆలయం పరిధిలో శ్రీ సీతా రామచంద్రస్వామి ఆలయం,శివాలయం ఉన్నాయి. నాచగిరి పై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడానికి తెలంగాణ రాష్ట్రము నుంచే కాకుండా,ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర,చుట్టుప్రక్కల రాష్ట్రాల నుంచి నిత్యం వందలాది మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు, కోర్కెలు కోరుకుంటారు. ఇక ప్రతీ యేటా జరిగే కల్యాణ బ్రహ్మోత్సవాళ్లకు,ఉగాది పర్వదినానికి ముందు వచ్చే ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు.

బ్రహ్మోత్సవాలు,కల్యాణోత్సవాళ్ళకే కాకుండా ఆలయ అర్చకులు, వేద పండితులతో నిత్యం పూజలు అందుకునే ఈ ఆలయం మాత్రం వసతుల కొరతకు నిలయంగా మారింది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడానికి ఎక్కువ శాతం భక్తులు శుక్రవారం నాచారంకు చేరుకొని శనివారం, ఆదివారాల్లో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి కోర్కెలు కోరుకుంటారు,మొక్కులు చెల్లించుకుంటారు.

ఐతే ఇలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎంతో భక్తితో, సంతోషంతో తరలివస్తే దేవుణ్ణి మొక్కడం ఒక ఎత్తయితే,ఇక్కడ అరకొర వసతులతో ప్రతినిత్యం అల్లాడటం ఒక ఎత్తవుతుంది. భక్తులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంబంధిత అధికారులకు మాత్రం చీమకుట్టినట్లు కూడా లేదు. ఇక్కడికి వచ్చే భక్తులకోసం 101 సత్రాలు, గెస్ట్ హౌస్ లు ఏర్పాటు చేసినప్పటికి భక్తులకు కావాల్సిన సరైన వసతులను ఆలయ అధికారులు ఏర్పాటు చేయడం లేదు.ఎంతో భక్తితో నాచారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి తరలివచ్చిన భక్తులకు అడుగడుగున సమస్యలే ఎదురవుతున్నాయి. మురికికాలువలు,దోమల బెడదతో పాటు,ఆలయ పరిసరాల్లో అపరిశుభ్రతతో భక్తులు అనారోగ్యానికి గురవుతున్నారు..నిత్యం పందుల స్వయిరా విహారంతో భక్తులకు దేవుడి మీద భక్తి ఏమో గాని ఆలయ అధికారుల పై మాత్రం విరక్తి చెందుతున్నారు. స్నానాల గదులు,మూత్రశాలలు లేక,కంపుకొడుతున్న పరిసర ప్రాంతాలతో ఆలయ వాతావరణం నిండిపోయింది.ఇన్ని ఇబ్బందులు ఎదురుకుంటున్న భక్తులు ఎన్నోసార్లు ఆలయ సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టిన ఫలితం లేకపోయింది. ఇక్కడ వసతులు ఎలా ఉంటే ఏంటి దేవుడి మీద భక్తితో వచ్చే భక్తులు ఎలాగైనా వస్తుంటారు అన్న ధోరనితో ఆలయ ఈవో వ్యహరిస్తుంది. ఐతే ఈ ఏడాది మార్చి 9న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుని ఉగాది ముందు ఫాల్గుణ పంచమి నుంచి స్వామి వారి కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.ఐతే ఏటా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నాచారం శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయానికి ఈ సారి భక్తుల రద్దీ తగ్గినట్లే కనిపిస్తోంది. వసతుల లేమితో పాటు, ఆలయ పరిసరాల్లో అపరిశుభ్రత,అధికారుల పట్టింపులేని తనంతో నాచారం ఆలయం వెలవెలబోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆలయాల అభివృద్ధికి కృషిచేస్తే, ఇప్పుడు మాత్రం ఆలయ అధికారులు నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

భక్తితో స్వామివారిని దర్శించుకోవడమేమో కానీ, కంపుకొడుతున్న ఆలయ వాతావరణం చూసి పరారయ్యే పరిస్థితి వచ్చిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో చరిత్ర కలిగిన నాచారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇప్పటికైనా సరైన వసతులు కల్పించి, పరిశుభ్రంగా ఉంచేలా ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు వేడుకుంటున్నారు.

ఎంతో మంది అధికారులు మారుతున్నప్పటికి ఆలయంలో అభివృద్ధి మాట దేవుడెరుగు, వసతుల లేమి, అపరిశుభ్రతతో భక్తులు అసహనానికి గురవుతున్నారు. ఐతే భక్తుల ఇక్కట్లను చోద్యంగా చూస్తున్న ఆలయ అధికారిని మాత్రం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

  

4వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య

4వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య

వరంగల్ టైమ్స్, ఢిల్లీ : దేశాన్ని కరోనా వైరస్ మరోసారి కలవరపెడుతోంది. ఎప్పటికప్పుడు రూపాలు మార్చుకుంటూ దాడి చేస్తున్న మహమ్మారి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. ప్రస్తుతం కరోనా ఉప వేరియంట్ జేఎన్.1 కారణంగా దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. డిసెంబర్ 25 నాటికి దేశ వ్యాప్తంగా యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 4 వేలు దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం దేశంలో 4,054 యాక్టివ్ కేసులున్నాయి. ఆదివారం నాటికి 3,742 గా ఉన్న యాక్టివ్ కేసులు, సోమవారం నాటికి 4 వేలు దాటాయి. కరోనా కారణంగా గత 24 గంటల్లో కేరళలో ఒకరు మరణించారు. కోవిడ్ సబ్-వేరియంట్ జేఎన్.1 మొదటిసారిగా గుర్తించిన కేరళలో ఒక రోజులో అత్యధిక సంఖ్యలో 128 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా కారణంగా ఇప్పటివరకు 5,33,334 మంది చనిపోయారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 315 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4,44,71,860 చేరుకుంది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

స్కూటీలు ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధం!

స్కూటీలు ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధం!

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రూ.350 కోట్లతో విద్యార్దినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధం అవుతుంది. ఎన్నికల హామీల్లో భాగంగా 18 యేండ్లు నిండిన అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సుమారు 1,784 కాలేజీలు ఉండగా, పేద విద్యార్థినులు సుమారు 5 లక్షల మంది వరకు ఉన్నారు. వీరిలో 2 లక్షల మంది మహానగర పరిధిలో ఉండగా ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న వారు 70 వేల మంది వరకు ఉన్నారు. కేంద్ర సబ్సిడీ పోను ఒక్కో స్కూటీకి 50వేల రూపాయల చొప్పున 70 వేల స్కూటీలకు రూ.350 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. విధివిధానాలు, దరఖాస్తు చేసుకునే వివరాలు త్వరలో విడుదల చేయనుంది.

బిగ్‌బాస్‌ నిర్వాహకులకు పోలీసుల నోటీస్

బిగ్‌బాస్‌ నిర్వాహకులకు పోలీసుల నోటీస్

 

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : బిగ్‌బాస్‌ నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసులు డిసెంబర్ 25న ( సోమవారం) నోటీసులు జారీ చేశారు. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్-7 ఫైనల్స్ టైంలో హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాల ధ్వంసంపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఈ ఘటనలపై యాజమాన్యం ఎండమోల్ షైన్ కు తాజాగా 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. విచారణ అధికారి ముందు మూడ్రోజుల్లో హాజరుకావాలని ఆదేశించారు. ఈ వ్యవహారంలో రెండు కేసులు నమోదయ్యాయి. నమోదైన రెండు కేసుల్లో ఇప్పటివరకు 24 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మరోవైపు పల్లవి ప్రశాంత్ కు సంబంధించిన కేసులో డిసెంబర్ 25న మరో ముగ్గురు అరెస్టయ్యారు. సరూర్ నగర్ కు చెందిన విద్యార్థి అవినాష్ రెడ్డి, యూసఫ్ గూడకు చెందిన సుధాకర్, పవన్ లను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఇక బిగ్‌బాస్‌ తెలుగు సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్ కు రెండ్రోజుల క్రితం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతీ ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు హాజరై, సంతకాలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఆర్టీసీ బస్సులపై దాడి, ధ్వంసం కేసులో 12 మంది నిందితులు సైతం బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు.

3 క్రిమినల్ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం

3 క్రిమినల్ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం

వరంగల్ టైమ్స్, ఢిల్లీ : మూడు కొత్త క్రిమినల్‌ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. దీంతో భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులు చట్టంగా మారాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశంలో మూడు క్రిమినల్ బిల్లులను పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించిన విషయం తెలిసిందే. అనంతరం ఈ బిల్లులను రాష్ట్రపతి అనుమతి కోసం పంపించారు. బ్రిటీష్ వలస పాలన నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మూడు కీలక బిల్లులను గురువారం రాజ్యసభ ఆమోదించింది. భారతీయ న్యాయ సంహిత బిల్లు, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిల్లు, భారతీయ సాక్ష్య అధీనం బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన ఈ బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం.

ఇండియన్ పీనల్ కోడ్-1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ -1898, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్-1872 స్థానంలో ఈ మూడు బిల్లులను తీసుకొచ్చారు. ఈ బిల్లులు చట్ట రూపం దాల్చితే ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ మొదలుకొని తీర్పు వరకు అన్నీ ఆన్లైన్ అవుతాయి. దేశ విద్రోహ చట్టం రద్దైపోయింది. రాజద్రోహాన్ని దేశద్రోహంగా మార్చారు. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు భంగం కల్గించే చర్యలకు కొత్త చట్టం ప్రకారం శిక్షలుంటాయి అని అమిత్ షా వివరించారు. దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, కోర్టులు డిజిటైజ్ అవుతాయని చెప్పారు. వీటిల్లో చండీగఢ్ మొట్టమొదటగా డిజిటైజ్ అవుతుందన్నారు. బ్రిటీష్ పాలనలో గాంధీజీ, తిలక్, సావర్కర్ వంటి వారిని జైళ్లకు పంపిన నిబంధనలను తొలగించడం సంతోషాన్నిచ్చిందని మంత్రి చెప్పారు. బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు సభలో లేనప్పటికీ మంత్రి ఆ పార్టీపై విమర్శలు చేశారు. ఇటాలియన్ అద్దాలు ధరించిన వారు భారత పార్లమెంట్ కొత్త క్రిమినల్ చట్టాలను రూపొందించడాన్ని సగర్వంగా భావించారంటూ కాంగ్రెస్ నేత సోనియానుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.

 

ఎన్నికల వేళ సీఎం జగన్ కొత్త పథకాలు

ఎన్నికల వేళ సీఎం జగన్ కొత్త పథకాలు

– మహిళలకు వరాలు..రైతు రుణమాఫీ..!?
వరంగల్ టైమ్స్, అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. అధికారం నిలబెట్టుకోవటమే లక్ష్యంగా వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. పొత్తులతో జగన్ ఓటమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకం అవుతున్న వేళ, జగన్ సంక్షేమమే అస్త్రంగా బరిలోకి దిగుతున్నారు. మరిన్ని పథకాల ప్రకటన పైన కసరత్తు జరుగుతోందని సమాచారం. రైతులు, మహిళలే లక్ష్యంగా సంక్రాంతి వేళ కీలక ప్రకటనకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.

జగన్ కొత్త అస్త్రాలు : సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. ప్రతిపక్షాలన్నీ కలిసి వచ్చినా తాను సింగిల్ గానే పోటీ చేస్తానని ప్రకటించారు. ఇదే సమయంలో తాను అమలు చేసిన సంక్షేమమే తనను గెపిస్తుందని విశ్వసిస్తున్నారు. అటు ప్రతిపక్షాలు పొత్తులతో జగన్ ను ఓడించాలనే లక్ష్యంతో వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఈ సమయంలో జగన్ వారి పపైన ఎన్నికల అస్త్రాలను సిద్దం చేస్తున్నారు. పులివెందుల పర్యటనలో భాగంగా పార్టీ నేతలతో జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. భవిష్యత్ లో సరి కొత్త పథకాలు తీసుకొస్తున్నట్లు సూచన ప్రాయంగా వెల్లడించారు. వివక్ష లేని సుపరిపాలన తన లక్ష్యమని స్పష్టం చేసారు. నమ్మకం రెట్టింపు అయ్యేలా పని చేస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు.

రైతు రుణ మాఫీ : సామాజిక – ప్రాంతీయ సమీకరణాలను పక్కాగా అమలు చేస్తున్న సీఎం జగన్ మరో కొత్త వరం ప్రకటనకు సిద్దం అవుతున్నట్లు అధికార పార్టీలో ప్రచారం సాగుతోంది. ఎన్నికల ముందే రైతు రుణమాఫీ ప్రకటన దిశగా అడుగులు వేస్తున్నట్లు పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. రైతులను మరింత దగ్గర చేసుకోవటంతో పాటుగా.. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేయాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో రైతులకు సంబంధించి రుణమాఫీ పైన ఆలోచన జరుగుతోందని పార్టీ ముఖ్య నేతల మధ్య చర్చ జరుగుతోంది. దీనిని అమలు చేయటం లేదా స్పష్టమైన హామీ ద్వారా ప్రతిపక్షాలను పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టాలనేది సీఎం వ్యూహంగా తెలుస్తోంది. 2014 లో చంద్రబాబు,పవన్ కల్యాణ్ కలిసి ప్రచారం చేసిన సమయంలో రైతు రుణమాఫీ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత అమల్లో షరుతులు పెట్టి..పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ఇప్పుడు తాను చెప్పిందే చేస్తానని, చేసేదే చెబుతానంటూ రైతు రుణమాఫీ విషయంలో జగన్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

షార్ప్ కిడ్స్ అబాకస్ స్టేట్ విన్నర్ రసజ్ఞ

షార్ప్ కిడ్స్ అబాకస్ స్టేట్ విన్నర్ రసజ్ఞ

– విజయవంతంగా షార్ప్ కిడ్స్ అబాకస్ రాష్ట్ర స్థాయి పోటీలు
– రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి విజేత రసజ్ఞ
– విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లు ప్రదానం

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : షార్ప్ కిడ్స్ అబాకస్ రాష్ట్ర స్థాయి పోటీలు ఆదివారం ఉదయం వరంగల్ నగరంలోని సుశీల్ గార్డెన్స్ లో నిర్వహించారు. అనంతరం సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి హాజరైన విద్యార్థినీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన సందర్భంగా అతిథుల చేతుల మీదుగా మెడల్స్, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. వరంగల్ బట్టల బజార్ షార్ప్ కిడ్స్ బ్రాంచ్ కు చెందిన 8వ లెవెల్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని దివ్వెల రసజ్ఞ రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి కైవసం చేసుకుంది. అతిథుల చేతుల మీదుగా మెడల్, షీల్డు అందుకున్న రసజ్ఞను టీచర్ నళినితో పాటు తల్లిదండ్రులు నిర్మల, పూర్ణచందర్, నానమ్మ కుసుమలత, తోటి విద్యార్థులు అభినందించారు.మొత్తం మూడేళ్ళలో అన్ని లెవెళ్లు పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ సాధించిన 142 మంది విద్యార్థులకు గ్రాండ్ మాస్టర్ సర్టిఫికెట్లతో పాటు షీల్డులు బహుకరించారు. అదే విధంగా 13 లెవెల్స్ పూర్తి చేసి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా ఛాంపియన్ కప్స్ అందచేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ వీసీ జి.దామోదర్ ముఖ్య అతిథిగా పాల్గొనగా షార్ప్ అబాకస్ డైరెక్టర్ సరిత సునిల్, కెఎంసి ఫిజికల్ డైరెక్టర్ తుమ్మ ప్రభాకర్ రెడ్డి, వరంగల్ ఫ్రాంచైజ్ గార్లపాడ్ శాంతి గురురాజ్, టీచర్లు నళిని, ప్రణీత, జగన్, రాము, తేజస్వి, రవిశంకర్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

‘సదైవ్ అటల్’ వద్ద నివాళులర్పించిన మోడీ

‘సదైవ్ అటల్’ వద్ద నివాళులర్పించిన మోడీ

– ‘సదైవ్ అటల్’వద్ద రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
– పుష్పాంజలి ఘడించిన మంత్రులు, బీజేపీ నేతలు

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి 99వ జయంతిని బీజేపీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ఢిల్లీలో వాజ్ పేజ్ స్మృతివనం ‘సదైవ్ అటల్’వద్ద ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పలువురు నివాళులు అర్పించారు. ప్రధానితో పాటు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, స్పీకర్ ఓం బిర్లా తదితరులు పుష్పాంజలి ఘటించారు. ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా వాజ్ పేజ్ గొప్పతనాన్ని తెలిపారు. భారతదేశాన్ని బలోపేతం చేయడానికి, అభివృద్ధి చేయడానికి అటల్ బిహారీ వాజ్ పేయి తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవ మనందరికీ స్ఫూర్తిదాయకం అని తెలిపారు. వాజ్ పేయి చేసిన అభివృద్ధి పనులను లక్షలాది మంది భారతీయుల జీవితాలను ప్రభావితం చేశాయని అన్నారు.

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.’ఈ పండుగ అందరికీ ఆనందం, శాంతి, శ్రేయస్సును అందించాలని కోరుకుంటున్నాను. క్రిస్మస్ సామరస్యం, కరుణ స్ఫూర్తికి ప్రతీక. ప్రతి ఒక్కరూ సంతోషంగా,ఆరోగ్యంగా ఉండే ప్రపంచం కోసం కలిసి పని చేద్దాం. ప్రభువైన క్రీస్తు గొప్ప బోధనలను కూడా మనం గుర్తుచేసుకుందాం’అని మోడీ ట్వీట్ చేశారు.

Latest Updates

Most Viewed

Videos

Top Stories

Cinema