ఓరుగల్లులో షర్మిల మాటల తూటాలు !
వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తెలంగాణ ప్రభుత్వంపైన, సీఎం కేసీఆర్ పైన, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైన హాట్ డైలాగులతో హీట్ పుట్టిస్తున్నారు. పాదయాత్రలో ఆమె చేస్తున్న విమర్శలు బాణాల్లా దూసుకుపోతున్నాయి. తాను ఎవరో వదిలిన బాణం కాదని నిరూపించుకునే ప్రయత్నంలో ఒక్కోసారి ఆమె నోటిదురుసును చాటుకుంటున్నారు. ఆమె డైలాగులు చాలావరకు శృతిమించి ఉంటున్నాయి. ఈ డైలాగులతో షర్మిలకు ఎలాంటి లాభం చేయకపోగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కలిసి వస్తున్నాయన్న మాట బలంగా వినిపిస్తోంది.
*వాళ్లనే గట్టిగా టార్గెట్ చేసింది..
ప్రస్తుతం ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఏ జిల్లాలోనూ లేని విధంగా ఈ జిల్లా ఎమ్మెల్యేలను షర్మిల గట్టిగా టార్గెట్ చేశారు. ముఖ్యంగా ఆ మధ్య నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై వ్యక్తిగత దూషణలు చేశారు. మగతనం అంటూ వ్యాఖ్యలు చేసి మాటల తూటాలు పేల్చారు. దీనికి బీఆర్ఎస్ శ్రేణుల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైంది. చివరకు పాదయాత్రను ఆపేయాల్సిన పరిస్థితి వచ్చేసింది.
*పెద్దికి ప్లస్ పాయింటైన షర్మిల డైలాగులు ..
పాదయాత్ర ఆగిన సంగతి పక్కన బెడితే షర్మిల పేల్చిన డైలాగులతో పెద్ది సుదర్శన్ రెడ్డికే లాభం జరిగిందన్న మాట వినిపిస్తోంది. ఒక మహిళ అయి ఉండి కూడా షర్మిల నోటికొచ్చినట్లు మాట్లాడినా, పెద్ది హుందాగా స్పందించారన్న వాదన ఉంది. పెద్దిని టార్గెట్ చేయబోయి, షర్మిల స్వయంగా టార్గెట్ అయిపోయారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆవేశంలో నోరుజారిన మాటలను వెనక్కు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ… షర్మిల మళ్లీ స్పందించిన తీరుతో ఆమె సొంతపార్టీ క్యాడరే అవాక్కయినట్లు టాక్.
*మానకోటలో షర్మిల తీరు తగ్గలే..
నర్సంపేట హీట్ తగ్గిందనుకుంటే ఇప్పుడు మానుకోటలో మాటల మంటలు రేపారు షర్మిల. శంకర్ నాయక్ పై నోటికొచ్చినట్లు మాట్లాడారు. దీంతో మరోసారి పాదయాత్రలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ వ్యవహారం అరెస్ట్ వరకు వెళ్లింది. చివరకు హిజ్రాలు కూడా స్పందించి, షర్మిలను ఎండగట్టారు. ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసే వరకు పరిస్థితి వచ్చేసింది. షర్మిల వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వకుండా శంకర్ నాయక్ కూడా సైలెంట్ గా ఉండడం హుందాగా ఉందంటున్నారు విశ్లేషకులు. శంకర్ నాయక్ సైలెంట్ గా ఉండడం ఆయనకే ప్లస్ అవుతుందని స్పష్టం చేస్తున్నారు.
* ఎమ్మెల్యేలకు కలిసొస్తున్న షర్మిల పంచ్ డైలాగులు..
షర్మిల ఇలా నోరు ఎందుకు జారుతున్నారో ఎవరికీ అంతుబట్టడం లేదు. ప్రభుత్వంపై, ఎమ్మెల్యేలపై విమర్శలు చేస్తే ఎవరూ అంతగా పట్టించుకోరు. కానీ అందుకు ఆమె వాడే భాష కరెక్ట్ గా ఉండాలి. హుందాగా ఉండాలి. కానీ ఇక్కడే ఆమె పప్పులో కాలేస్తున్నారు. పంచ్ డైలాగులు వాడబోయి ఇంకేదో అనేస్తున్నారు. అందుకే ఎమ్మెల్యేలపై విమర్శలు చేయడానికి ఆమె ఎంచుకున్న భాష మాత్రం సరిగా ఉండడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆమె వాడే భాష పరోక్షంగా ఎమ్మెల్యేలకే కలిసి వస్తోందని ప్రచారం జరుగుతోంది.
*అప్పటి వరకైనా భాష ఛేంజ్ చేస్తుందా.. లేదా డోస్ పెంచుతుందా!
ఒక పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల ఇలాంటి మాటలు మాట్లాడకపోవడమే మంచిదని పరిశీలకులు సూచిస్తున్నారు. పంచు డైలాగులంటే చురకలు అంటించేలా ఉండాలి కానీ దిగజారుడుగా కాదని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. రాజకీయాల్లో ఇలాంటి మాటలు నేతల స్థాయిని దిగజార్చుతాయని చెబుతున్నారు. ఏపీలో ఏమో కానీ తెలంగాణ రాజకీయాల్లో ఇలాంటి మాటలకు తావులేదన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇంకా ఆ స్థాయికి మన తెలంగాణ రాజకీయం దిగజారలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఇప్పటికైనా షర్మిల భాష మార్చుకుంటారా? లేక ఎన్నికల నాటికి మరింత డోసు పెంచి విమర్శల పాలవుతారా? అన్నది చూడాలి.