200కి.మీ. పూర్తి చేసుకున్న లోకేష్ పాదయాత్ర
లోకేష్ వద్దకు చేరుకున్న భార్య బ్రాహ్మణి, కొడుకు దేవాన్ష్
వరంగల్ టైమ్స్, చిత్తూరు జిల్లా : ప్రజాస్వామ్య బద్ధంగా గాంధేయమార్గంలో పాదయాత్ర చేస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. జగన్ లా ప్రజల సొమ్ము తిని నేను జైలుకెళ్లి రాలేదని, తాను చేపట్టిన పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను లోకేష్ ప్రశ్నించారు. 16వ రోజు చేపట్టిన పాదయాత్రకు పోలీసులు అడుగడుగున అడ్డంకులు సృష్టించారు. పాదయాత్రలో భాగంగా లోకేష్ 200 కిలో మీటర్లు పూర్తి చేశారు. జగన్ పాదయాత్రలని తాము ఏనాడూ అడ్డుకోలేదని ప్రజలకు లోకేష్ గుర్తు చేశారు.
యువగళం జైత్రయాత్రలో భాగంగా జిడి నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలం కత్తెరపల్లి కూడలిలో యువనేత పాదయాత్ర 200 కిలో మీటర్లు చేరుకోగానే కార్యకర్తలు లోకేష్ పై పూలవర్షం కురిపించారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేశారు. యువగళం జైత్రయాత్ర 200 కిలో మీటర్లు చేరుకున్నందుకు గుర్తుగా టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని లోకేష్ ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
200 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తైన సందర్భంగా నారా లోకేష్ వద్దకు భార్య బ్రాహ్మణి, దేవాన్ష్ చేరుకున్నారు. లోకేష్ పాదయాత్రకు మద్దతుగా బ్రాహ్మణి మరియు దేవాన్ష్ చిత్తూరుకు వెళ్లారు.
నారా లోకేష్ పాదయాత్ర ఫిబ్రవరి 13న తిరుపతిలోకి ప్రవేశం ఉంది. దీంతో తిరుపతిలో స్వాగతం పలకడానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా ఏర్పాట్లు చేశారు.